Under -19: నేటి నుంచి అండర్ - 19 వరల్డ్ కప్.. భావి క్రికెటర్లు వెలుగులోకి వచ్చే తరుణం!
- 19న శ్రీలంకతో భారత్ తొలి మ్యాచ్
- రాణిస్తే, ప్రధాన జట్టులో అవకాశాలు పుష్కలం
- సెలక్టర్ల చూపంతా టోర్నీపైనే
నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఈ పోటీల్లో సత్తా చాటే యువ ఆటగాళ్లు, వారివారి దేశాల్లో భవిష్యత్ క్రికెటర్లు అవుతారని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. భారత తరఫున అండర్ - 19 పోటీలు ఆడిన విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు తదితరులు సీనియర్ జట్టులో స్థానం సంపాదించి రాణించారు.
క్రిస్ గేల్ నుంచి డేవిడ్ వార్నర్, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్ వంటి విదేశీ స్టార్ ప్లేయర్లు కూడా ఆయా దేశాలు ఆడిన అండర్ - 19 పోటీల నుంచి వెలుగులోకి వచ్చిన వారే. ఇక ఈ సంవత్సరం జరిగే పోటీల్లో ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని భారత జట్టు, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతుండగా, ఆసీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తదితర జట్ల నుంచి పెను సవాళ్లు ఎదురు కానున్నాయి.
మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో సిద్ధమైన భారత జట్టు, మరోసారి కప్పును కైవసం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. రెండేళ్ల క్రితం పృథ్వీ షా కెప్టెన్ గా ఇవే పోటీల్లో బరిలోకి దిగిన జట్టుకు కూడా ద్రావిడే కోచింగ్ ఇచ్చాడు. అప్పుడు గెలిచిన స్ఫూర్తినే ఇప్పుడు కూడా యువ ఆటగాళ్లు ప్రదర్శిస్తారని క్రీడాభిమానులు భావిస్తున్నారు.
నేడు ఆఫ్ఘన్, దక్షిణాఫ్రికా మధ్య తొలి పోరు జరుగనుండగా, ఇండియా జట్టు, 19వ తేదీన శ్రీలంకతో తన తొలి మ్యాచ్ ని ఆడనుంది. ఆపై 21న జపాన్ తో, 24న న్యూజిలాండ్ తో మ్యాచ్ లుంటాయి. ఈ మూడు మ్యాచ్ ల్లో కనీసం రెండు గెలిస్తే, తదుపరి నాకౌట్ దశకు అర్హత సాధించవచ్చు. ఫిబ్రవరి 4, 6 తేదీల్లో సెమీస్, ఆపై 9న పోట్ ఎస్ట్ రూమ్ లో ఫైనల్ జరుగనుంది.
ఇక 1988లో అండర్ - 19 వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం కాగా, కెప్టెన్ లుగా వివిధ దేశాలకు నాయకత్వం వహించిన వారికంటే, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన వారికి ఆయా దేశాలు బ్రహ్మరథం పట్టాయి. ఇండియా నుంచి యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితరులు వారు ఆడిన సంవత్సరాల్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీలుగా నిలిచిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ ఏ భావి క్రికెట్ స్టార్ ను పరిచయం చేస్తుందో వేచి చూడాలి.