Nirbhaya: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతికి పంపిన కేంద్ర హోంశాఖ
- మంగళవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న ముఖేశ్ సింగ్
- పిటిషన్ ను రాష్ట్రపతి పరిశీలనకు పంపిన కేంద్ర హోంశాఖ
- రాష్ట్రపతి నిర్ణయం తర్వాతే అమలుకానున్న ఉరిశిక్ష
నిర్భయ కేసు దోషులు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ ఉరిశిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరిని ఈనెల 22న ఉరి తీయాల్సి ఉంది. మరోవైపు, దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ గత మంగళవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి స్పందన తర్వాతే ఉరి తీయడం జరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. ఈ పిటిషన్ పై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ మధ్యనే ఓ సందర్భంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని క్షమించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
2012లో పారా మెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై కదులుతున్న బస్సులో ఈ నలుగురు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిర్భయ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో యావత్ దేశం అట్టుడికిపోయింది. ఆమె పేరు మీదే నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది.