Visakhapatnam District: గొర్రెలు, మేకలకు పెళ్లంట... విశాఖ జిల్లాలో ఇదో వింతంట!
- యాదవ సామాజిక వర్గంలో ఓ నమ్మకం
- ఇలా చేస్తే రోగాలు రావన్న భావన
- పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం
ప్రాంతం, సామాజిక వర్గం ఆధారంగా ఏర్పడిన కొన్ని నమ్మకాలు, సంప్రదాయాలు వింతగా, ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. తరాలు మారినా తమ ఆచార సంప్రదాయాలను కొనసాగించడాన్ని ఆయా వ్యక్తులు గర్వంగా భావిస్తుంటారు. విశాఖ జిల్లాలోని యాదవ కులస్తులు పాటించే ఈ ఆచారం కూడా అటువంటిదే.
సంక్రాంతి సందర్భంగా ఈ కులస్తులు తమ మందలోని గొర్రెలు, మేకలకు పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మందలోని మూగజీవాలు రోగాల పాలు కావని, సంతానాభివృద్ధి జరుగుతుందని ఓ నమ్మకం.
అందుకే తరతరాలుగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా విధిగా ఈ పెళ్లి జరిపిస్తారు. జిల్లాలోని చోడవరం, రావికమతం తదితర ప్రాంతాల్లోని యాదవులు కనుమరోజు ఈ వేడుకను ఘనంగా జరిపిస్తారు. పెళ్లి రోజు ఉదయాన్నే గ్రామంలోని వారు సమీపంలోని పుట్టవద్దకు చేరుకుంటారు.
తమ మందల్లోని గొర్రెలు, మేకలకు పసుపురాసి బొట్టు పెడతారు. ధూపం వేసి మాంగల్యధారణ కార్యక్రమం పూర్తి చేస్తారు. అనంతరం గొర్రెలు, మేకల చెవుల చివర్లుకోసి పుట్టలో వేస్తారు.