Nirbhaya: తాను రాజకీయాల్లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన నిర్భయ తల్లి
- న్యాయం కోసం పోరాడుతూ దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఆశాదేవి
- కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు
- తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదన్న నిర్భయ తల్లి
కొన్నేళ్ల కిందట దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడిన కిరాతకులకు మరణశిక్ష కోసం తీవ్రంగా పోరాడడం ద్వారా నిర్భయ తల్లి ఆశాదేవి ఎంతో గుర్తింపు సంపాదించారు. మరికొన్నిరోజుల్లో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ఆశాదేవి పేరు కూడా మార్మోగిపోతోంది.
ఈ క్రమంలో ఆమె రాజకీయాల్లోకి వెళతారంటూ ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. దీనిపై ఆశాదేవి స్పందించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తనను కాంగ్రెస్ సహా మరే పార్టీ నేతలు సంప్రదించలేదని తేల్చి చెప్పారు. తన కుమార్తెకు న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే పోరాడుతున్నానని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో చేరుతున్నట్టు ఎలా ప్రచారం చేస్తారో అర్థం కావడం లేదని అన్నారు.