BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదల
- ఈ నెల 20న అధ్యక్ష పదవికి నామినేషన్
- ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే 21న ఎన్నిక
- జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమే!
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమే అయినా, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎన్నికల నిర్వహణ ఇన్ చార్జి రాధామోహన్ సింగ్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. తొలుత 75 శాతం బూత్, 50 శాతం మండల, 60 శాతం జిల్లాల, 21 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపడతారు.
ఈ నెల 20న జాతీయ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేపడతారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు.