CBI: సీబీఐ కొత్త జేడీగా మనోజ్ శశిధర్ నియామకం
- ఐదేళ్లపాటు సీబీఐలో కొనసాగనున్న మనోజ్ శశిధర్
- మనోజ్ శశిధర్ గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి
- ఏపీతో సంబంధం లేని వ్యక్తిని నియమించాలని లేఖ రాసిన విజయసాయి
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ గా మనోజ్ శశిధర్ ను నియమించారు. ఈయన 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన సీబీఐ జేడీగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.
కాగా, సీబీఐ జేడీగా ఏపీకి సంబంధంలేని అధికారిని నియమించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో సీబీఐ జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారని, ప్రస్తుత జేడీ కృష్ణ కూడా తెలుగు వ్యక్తి అని తన లేఖలో తెలిపారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై పరిశీలన జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్ హైదరాబాదులో సీబీఐ జేడీగా రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.