shirdi: శిరిడీ సాయిబాబా ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవం: స్పష్టం చేసిన సంస్థాన్ ట్రస్ట్
- శిరిడీ సాయిబాబా జన్మ స్థలంపై వివాదం
- గ్రామస్తుల నిరసనలు.. ఆలయం మూసివేతని వార్తలు
- గ్రామస్తుల బంద్‌తో తమకు సంబంధం లేదన్న ట్రస్ట్
- భక్తులు ఆందోళనకు గురికావద్దని ప్రకటన
శిరిడీ సాయిబాబా జన్మ స్థలమని పేరున్న మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలోని పథ్రీని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దానికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం, శిరిడీ గ్రామస్తులు బంద్‌కు పిలుపునివ్వడంతో ఆ ఆలయం మూసివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై శిరిడీ సంస్థాన్ బోర్డు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ స్పష్టతనిచ్చారు. శిరిడీ ప్రజలు కేవలం నిరసన చేపడుతున్నట్లు, పట్టణ బంద్‌ను మాత్రమే పాటించనున్నట్టు తెలిపారు. అంతేగానీ, ఆలయాన్ని మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ఆలయాన్ని తెరిచే ఉంచుతామని, గదుల సౌకర్యం, ప్రసాద వితరణ అన్నీ ఎప్పటిలాగే జరుగుతాయని సంస్థాన్ బోర్డు తెలిపింది. ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా శిరిడీ ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తో ట్రస్ట్‌కు సంబంధం లేదని పేర్కొంది. భక్తులు ఆందోళనకు గురికావద్దని చెప్పింది.