Andhra Pradesh: గవర్నర్ ను కలిసిన రాజధాని మహిళలు... జగన్ కు కనికరం కలగడం లేదని ఆవేదన
- అక్రమ అరెస్టులు, దాడులపై గవర్నర్ కు నివేదన
- శాంతియుతంగా ఉద్యమిస్తున్నామని ఉద్ఘాటన
- ప్రాణాలైనా ఇస్తాం కానీ అమరావతిని వదులుకోబోమని స్పష్టీకరణ
ఏపీ రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న 29 గ్రామాల మహిళలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఈ రోజు కలిశారు. అక్రమ అరెస్టులు, మహిళలపై పోలీసుల దాడులను గవర్నర్ కు వివరించారు. అనంతరం రాజధాని మహిళలు మీడియాతో మాట్లాడుతూ, రాజధాని కోసం మహిళలు ఉద్యమిస్తున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా జగన్ కు కనికరం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాజధానిలో భూములు ఇచ్చింది చంద్రబాబుకు కాదని, ప్రభుత్వానికి ఇచ్చామని వారు ఉద్ఘాటించారు. కానీ, రాజధాని గురించి మంత్రులు అవహేళనగా, అపహాస్యం చేస్తూ మాట్లాడడం తమకు బాధ కలిగిస్తోందని తెలిపారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ అమరావతిని మాత్రం వదులుకోమని మహిళలు స్పష్టం చేశారు.