TRS: ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి.. మళ్లీ పార్టీలోకి వస్తానంటే తీసుకోం: కేటీఆర్

  • తిరుగుబాటు అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ చెక్
  • సిరిసిల్లా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
  • బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువంటూ ఎద్దేవా

ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి మళ్లీ పార్టీలోకి వస్తానంటే వారిని తీసుకోమని టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలువురు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి వస్తానంటే ఒప్పుకునేది లేదన్నారు.  వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..సిరిసిల్లలో ఉన్న 39 స్థానాల్లో 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయన్నారు. మిగిలిన స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పారు. నాలుగేళ్లలో సిరిసిల్లాకు రైలును తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ అని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలోని పట్టణాలను దేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తామన్నారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడను అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News