Visakhapatnam District: అమ్మకోసం ఫలించిన అన్వేషణ : ఇరవై ఏళ్ల తర్వాత తల్లి ఒడికి చేరిన బిడ్డ
- తొమ్మిదేళ్ల వయసులో విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన బాలుడు
- రైలెక్కి చెన్నై చేరగా అప్పటి నుంచి అక్కడే
- సంక్రాంతి ముందు అరకు రాక
తెలిసీ తెలియని వయసులో కుటుంబ సభ్యులకు దూరమైన ఆ చిన్నారి ఇరవై ఏళ్ల అనంతరం తల్లి ఒడిని చేరి ఆనందాశ్రువులు రాల్చాడు. తొమ్మిది ఏళ్ల వయసులో తప్పిపోయి చెన్నై చేరిన ఆ బాలుడు అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. కుటుంబ సభ్యులను కలుసుకోవాలన్న లక్ష్యంతో సంక్రాంతికి ముందు జిల్లాకు చేరుకున్నాడు. తమిళం తప్ప మరే భాషరాని పరిస్థితుల్లోనూ పట్టువదలని విక్రమార్కుడిలా తన సొంతూరుగా భావిస్తున్న అరకులో అన్వేషించి చివరికి తల్లి చెంతకు చేరాడు.
వివరాల్లోకి వెళితే...విశాఖ జిల్లా అరకులోయ మండలం బొండాం పంచాయతీ మజ్జివలసకు చెందిన గంగాధరన్ బాల్యంలో విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిపోయాడు. పొరపాటున చెన్నై రైలెక్కాశాడు. చెన్నై చేరుకున్న బాలుడిని అక్కడి పోలీసులు అప్పట్లో అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే పెరిగి పెద్దవాడై ఎల్ ఐసీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఓ సందర్భంలో అరకులోయ ఫొటోలు చూస్తున్న అతనికి తన బాల్య జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. తన సొంతూరు అదేనని, తల్లిదండ్రులు అక్కడే ఉంటారని భావించి వెతికేందుకు పండగ ముందు నగరానికి చేరుకున్నాడు. ఊహ తెలిసిన తర్వాత చెన్నైలో పెరగడంతో తెలుగు పూర్తిగా మర్చిపోయాడు. తమిళం తప్ప ఏమీ రాని గంగాధరన్ చెప్పిన వివరాలతో అతని కుటుంబ సభ్యులను పట్టుకోవడం పోలీసులతోపాటు స్థానికులకు సాధ్యం కాలేదు.
ఈ వెతుకులాటలో ఉండగా అరకుకు చెందిన సింహాద్రితో గంగాధరన్ కు పరిచయం అయ్యింది. సంక్రాంతికి తన ఇంటికి రావాల్సిందిగా ఆమె ఆహ్వానించడంతో వారింటికి వెళ్లాడు. అక్కడ తన బాల్యం నాటి ఫొటో చూసి గుర్తుపట్టడంతో తాను చేరాల్సిన ఇంటికే చేరానని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తప్పిపోయిన బిడ్డే తిరిగి వచ్చాడని తెలియడంతో ఆ తల్లి ఉబ్బితబ్బిబ్బయ్యింది. విషయం పోలీసులకు చేర్చడంతో వారు గంగాధరను తల్లి సింహాద్రి, అతని తమ్ముడు, చెల్లెలకు లాంచనంగా అప్పగించారు.