Crime News: ప్రాంచైజీ ఆశ చూపి రూ.4.96 లక్షలు కొట్టేశాడు : నిందితుడి అరెస్టు

  • ఓఎల్ ఎక్స్ యాప్ లో ప్రకటన
  • సంప్రదించిన వ్యక్తికి ప్రాంచైజీ, ఉద్యోగంపై ఆశలు 
  • దఫదఫాలుగా భారీ మొత్తంలో గుంజేసిన మోసగాడు

దేశంలోనే అతి పెద్ద కంపెనీ ప్రాంచైజీ, అదే ప్రాంచైజీలో ఉద్యోగం...ఇంకేం కావాలి, తన దశ తిరిగిందని భావించిన ఓ వ్యక్తి ఆశలపై వలవిసిరి దాదాపు ఐదు లక్షలు నొక్కేశాడు ఓ మోసగాడు. పోలీసుల కథనం మేరకు...గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన గుంటూరు నాగభూషణం ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఓఎల్ ఎక్స్ యాప్ లో జియో ప్రాంచైజీ కోసం పడిన ప్రకటన చూసి అక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్ లో సంప్రదించాడు. తెనాలికి చెందిన బొల్లు ప్రదీప్ అలియాస్ సన్ని అనే యువకుడు ఫోన్ ఎత్తి ప్రాంచైజీతోపాటు ఉద్యోగం ఆశ చూపించాడు. ఇందుకు కొంత మొత్తం చెల్లించాలని కోరాడు.

దీంతో ఆశపడిన నాగభూషణం దఫదఫాలుగా అతని అకౌంట్ లో 4 లక్షల 96 వేల రూపాయలు జమచేశాడు. అప్పటికి దాదాపు 15 సార్లు డబ్బు తన అకౌంట్ లో వేయించుకున్న ప్రదీప్  ప్రాంచైజీ గురించి ఎటువంటి సమాచారం చెప్పక పోవడంతో అనుమానం వచ్చిన నాగభూషణం జియో సంస్థ ప్రతినిధులను సంపద్రించాడు. ప్రదీప్ తో తమ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పడంతో కంగుతిన్నాడు.

తాను మోసపోయానని గుర్తించిన నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ప్రదీప్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.4.96 లక్షల మొత్తాన్ని రికవరీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఆన్ లైన్లో ప్రకటనలు చూసి ఫోన్లోనే బేరసారాలు జరపవద్దని, అవసరం అనుకుంటే ఆయా కంపెనీల శాఖలకు వెళ్లి స్వయంగా ఆరాతీయాలని సూచించారు.

  • Loading...

More Telugu News