Yeman: యెమెన్ లో సైనికులపై డ్రోన్ దాడి... 80 మంది దుర్మరణం!
- మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులు
- భారీ శబ్దంతో పేలిన డ్రోన్ క్షిపణి
- 150 మందికి గాయాలు
యెమెన్ మరోసారి రక్తసిక్తమైంది. ఓ మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు డ్రోన్ క్షిపణిని ప్రయోగించడంతో 80 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. హుతి తిరుగుబాటుదారులే ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు. మరిబ్ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది. సైనిక శిబిరంలో ఏర్పాటు చేసిన మసీదులో ప్రార్థనలు జరుగుతున్న వేళ భారీ శబ్దంతో డ్రోన్ బాంబు పేలింది. ఈ ఘటనలో సుమారు 150 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు.
యెమెన్ లో దాదాపు ఆరేళ్ల క్రితం అంతర్యుద్ధం మొదలైన తరువాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి తెలిపారు. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతిస్తుండగా, ఇరాన్ పాలకులు హుతి తిరుగుబాటుదారులకు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. తాజా దాడిపై తిరుగుబాటు నేతలు ఇంకా స్పందించలేదు.