Kerala: మసీదులో హిందూ వివాహం... 10 సవర్ల బంగారం, రూ. 2లక్షల కట్నమిచ్చిన మత పెద్దలు!
- కేరళలోని చెరుపల్లి జమాత్ మసీదులో ఘటన
- బిడ్డ వివాహానికి సహకరించాలని కోరిన పేద తల్లి
- 1000 మందికి భోజనాలతో ఘనంగా వివాహం
తన బిడ్డ వివాహం చేసే స్తోమత తనకు లేదని, సహకరించాలని ఓ పేద తల్లి చేసిన విజ్ఞప్తికి మత భేదం చూడకుండా ముందుకు వచ్చిన ముస్లిం పెద్దలు, వివాహాన్ని మసీదులో ఘనంగా జరిపించారు. ఈ ఘటన కేరళలోని చెరుపల్లి జమాత్ మసీదులో ఆదివారం జరిగింది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్రంలో వెల్లివిరిసిన మత సామరస్యానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఇక పెళ్లికి పూర్తి సహాయ సహకారాలను అందించాలని నిర్ణయించుకున్న మత పెద్దలు, వధువు అంజుకు 10 సవర్ల బంగారాన్ని కానుకగా ఇవ్వడంతో పాటు, వరుడు శరత్ కు రూ. 2 లక్షల కట్నాన్ని కూడా అందించడం గమనార్హం. వివాహం అనంతరం పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేయగా, పలువురు బంధుమిత్రులు, ముస్లిం పెద్దలు హాజరై, యువ జంటకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేశామని మసీదు కమిటీ కార్యదర్శి నుజుముద్దీన్ అలుమ్మూట్టిల్ వ్యాఖ్యానించారు.