Cold: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన చలి... కారణమిదే!
- హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రత 19.7 డిగ్రీలు
- మాల్దీవులపై ఉపరితల ఆవర్తనం
- తెల్లవారుజామునే రహదారులపై మార్నింగ్ వాక్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి ఒక్కసారిగా తగ్గిపోయింది. నిన్న హైదరాబాద్ లో పగలు 31.7 డిగ్రీలు, రాత్రి 19.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే, ఇది నాలుగు డిగ్రీలు అధికం.
ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. చలి తగ్గడంతో తెల్లవారుజామునే రహదారులపై జనసంచారం కనిపిస్తోంది. చలి కారణంగా ఆలస్యంగా మార్నింగ్ వాక్ కు వస్తున్న ప్రజలు, ఇప్పుడు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి, ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. మాల్దీవులపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయని అధికారులు వెల్లడించారు.