Chiranjeevi: ఆ పాత్రకి చిరంజీవి సరిపోడని చాలామంది చెప్పారు: దర్శకుడు ధవళ సత్యం
- చిరంజీవి .. నేను ఒకే ఊళ్లో పుట్టాము
- ఒక సందర్భంలో చిరంజీవికి మాట ఇచ్చాను
- మాట నిలబెట్టుకున్నానన్న ధవళ సత్యం
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు ధవళ సత్యం మాట్లాడుతూ, చిరంజీవిని గురించి ప్రస్తావించారు. చిరంజీవి .. నేను పెనుగొండ అనే ఊళ్లో పుట్టాము. ఆ ఊరు ఆయనకీ నాకు అమ్మమ్మగారి ఊరు .. అక్కడ ఇద్దరి ఇళ్లు ఎదురెదురుగా ఉండేవి. ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆ తరువాత నరసాపురం కాలేజ్ లో చదువుకునేటప్పుడు .. చిత్ర పరిశ్రమకి వచ్చిన తొలినాళ్లలో ఇద్దరం తరచూ కలుస్తూ మాట్లాడుకునే వాళ్లం.
'నేను దర్శకుడినైతే నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తాను' అని ఒక సందర్భంలో చిరంజీవితో అన్నాను. 'ఓ ఐదు సీన్లు వుండే వేషం ఇవ్వు చాలు' అని ఆయన అన్నాడు. అలా చిరంజీవికి ఇచ్చిన మాట మేరకు ఆయనతో 'జాతర' అనే సినిమాను చేశాను. ఆ పాత్రకి చిరంజీవి సరిపోడని చాలామంది చెప్పారు. అయినా నేను ఆయనను తీసేయలేదు. అందుకు కారణం చిరంజీవిపై నాకు గల నమ్మకం" అని చెప్పుకొచ్చారు.