Chandrababu: అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం ప్రకటించడం మా అదృష్టం: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
- సీఆర్డీఏ రద్దు బిల్లును స్వాగతిస్తున్నా
- సెక్రటేరియట్ తో సామాన్యులకు పని ఉండదు
- రాజధాని అంటే అందరిదీ.. కొందరిది మాత్రమే కాకూడదు
సీఆర్డీఏ రద్దు బిల్లును, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ప్రజలకు చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని, రైతుల ఆశలను ఆయన నీరు గార్చారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తన స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు. నాడు రైతులపై బలవంతంగా భూ సమీకరణ చట్టాన్ని రుద్దారని, శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం ప్రకటించడం తమ అదృష్టమని, అమరావతికి దక్కిన గౌరవమని అన్నారు. సెక్రటేరియట్ తో సామాన్యులకు పని ఉండదని చెప్పారు. రాజధాని అంటే అందరిదీ అని, కొందరిది మాత్రమే కాకూడదని అన్నారు. ప్రభుత్వాన్ని పేదవాడి ఇంటిముందుకు జగన్ తెచ్చారని కొనియాడారు. రైతులు కోరుకుంటే భూములను తిరిగి ఇవ్వాలని, అమరావతిని అగ్రికల్చర్ జోన్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు అన్ని రంగాల్లో ముందున్నాయని, రైలు కూత కూడా వినపడని గ్రామాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని చెప్పారు.