Kodali Nani: ఆ అమరావతిని పాడుపెట్టేశారు.. ఇది చంద్రబాబునాయుడి అమరావతి: కొడాలి నాని ధ్వజం
- అసలు అమరావతి ఇక్కడికి 25 కి.మీ. దూరంలో ఉంది
- ఆ అమరావతి గొప్ప పుణ్యక్షేత్రం
- అక్కడి నుంచి రాజులు పరిపాలించారు
అమరావతి గొప్ప పుణ్యక్షేత్రమని, చాలా మంది రాజులు ఇక్కడి నుంచి పరిపాలించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు వాస్తవమే కానీ, ఆ మాటలు ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతి గురించి కాదు అని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, అసలు అమరావతి ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని, ఆ అమరావతిని పాడుపెట్టేశారని, ‘ఇది చంద్రబాబునాయుడుగారి అమరావతి’ అని ఘాటుగా విమర్శించారు.
రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలని నాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కరెక్టు కాదని ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడే స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టడం తనకు ఇష్టం లేకనే చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, అవసరమైతే సలహాలు ఇస్తానని ప్రతిపక్ష నేతగా జగన్ అప్పుడు చెప్పారని అన్నారు.
అమరావతిలో రాజధాని లేనప్పటి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగానే ఉన్నాయని అన్నారు. సామాజిక వర్గం గురించి తాము ప్రచారం చేస్తున్నామని టీడీపీ నేత రామానాయుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. అలాంటి ఆరోపణలు తామేమీ చేయడం లేదని, టీడీపీ అనుకూల పత్రికలే ఆ విధమైన రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు.