Chandrababu: మాపై అధికారపక్ష సభ్యుల విమర్శలను వినలేని పరిస్థితి ఇది: చంద్రబాబునాయుడు
- ప్రజల కోసం ఇవన్నీ భరిస్తున్నాం
- ‘ఒక రాష్ట్రం ఒకే రాజధాని’ మా సిద్ధాంతం
- మూడు రాజధానులపై ప్రభుత్వ విధానం చెబితే బాగుండేది
అధికారపక్ష సభ్యులు తమపై చేస్తున్న విమర్శలను వినలేని పరిస్థితి అని, అయినా, ప్రజల కోసం ఇవన్నీ భరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ, ‘ఒక రాష్ట్రం ఒకే రాజధాని’ అన్నది తమ సిద్ధాంతం అని స్పష్టం చేశారు. తనపై వ్యక్తిగత దూషణలు చేసేందుకు అధికారపక్ష సభ్యులు పోటీపడ్డారని విమర్శించారు. మూడు రాజధానులపై ప్రభుత్వ విధానం చెబితే బాగుండేదని అన్నారు. శివరామకృష్ణన్ నివేదికలో మూడు రాజధానులు ఏర్పాటు చేయమని గానీ, విజయవాడ, గుంటూరులు రాజధాని ఏర్పాటుకు తగిన ప్రదేశాలు కావు అని కానీ, ఫలానా చోటే రాజధాని ఏర్పాటు చేయాలని గానీ ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు.
అమరావతిలో రాజధాని వల్ల ఆహారభద్రతకు ముప్పు వస్తుందన్న అధికారపక్ష వాదన కరెక్టు కాదని చెప్పారు. రాగద్వేషాలకు అతీతంగా నాడు టీడీపీ తీసుకున్న నిర్ణయమే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడమని స్పష్టం చేశారు. రాజధానిని మార్చాలని చూసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్ అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి మారిన ప్రతిసారి రాజధాని మారితే దీనికి అంతం ఉండదని అన్నారు. ఓటుకు నోటు కేసులో తన ప్రమేయం లేదని న్యాయస్థానం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తనపై ‘సిగ్గు లేకుండా’ అధికార పక్ష సభ్యులు విమర్శలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.