Chandrababu: అర్ధరాత్రి హైడ్రామా... చంద్రబాబును మూడు గంటల పాటు తిప్పిన పోలీసులు!

  • అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తరువాత పాదయాత్ర
  • అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
  • అరెస్ట్ చేసి వ్యాన్ లో తరలింపు
  • మంగళగిరిలో రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు

వెలగపూడి సచివాలయం ప్రాంతంలో గత అర్థరాత్రి హైడ్రామా నడిచింది. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తరువాత, చంద్రబాబు, తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెలగపూడి నుంచి మందడం వరకూ పాదయాత్రను తలపెట్టగా, పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో సీఎం కాన్వాయ్ వెళ్లనున్న కారణంగా పాదయాత్రకు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో, వారితో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు.

తాను పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నానని, తనను ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు. అదే సమయానికి అసెంబ్లీలో సీఎం ప్రసంగం ముగియడంతో, పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు, చంద్రబాబును, ఇతర నేతలను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, వ్యాన్ ఎక్కించారు.

ఆపై చంద్రబాబును ఆయన ఇంటి సమీపం వరకూ తీసుకెళ్లిన తరువాత, కిలోమీటర్ దూరంలో వ్యాన్ దారి మళ్లించారు. రెండు గంటల పాటు డొంక రోడ్డు, ఇతర దారుల్లో 20 కిలోమీటర్లకు పైగా తిప్పారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి కరకట్టవైపు కాకుండా వెంకటపాలెం వైపు వాహనాన్ని పోనిచ్చారు. ఆపై మళ్లీ మందడం పక్కనున్న కృష్ణాయపాలెంవైపు తీసుకెళ్లారు.

డొంకరోడ్డు గతుకుల్లో 3 కిలోమీటర్ల ప్రయాణం తరువాత, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకెళ్లారు. మంగళగిరి వీధుల్లో తిప్పుతున్న సమయంలో వ్యాన్ ను బలవంతంగా ఆపించి, కిందకు దిగిన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, స్వామి తదితరులు నడిరోడ్డుపై బైఠాయించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఆపై చంద్రబాబు మరోసారి పాదయాత్రను తలపెట్టగా, పోలీసులు మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతించేది లేదని స్పష్టం చేస్తూ, పీఎస్ నుంచి ఆయన కాన్వాయ్ లోనే చంద్రబాబును ఇంటికి పంపించారు.

  • Loading...

More Telugu News