Andhra Pradesh: బలంలేని వైసీపీ, 3 రాజధానులపై నెగ్గేదెట్టా?... అందరి కళ్లూ మండలి పైనే!
- శాసన మండలిలో టీడీపీ ఆధిపత్యం
- బిల్లును అడ్డుకుని తీరుతామంటున్న టీడీపీ
- మరో ఏడాది తరువాతనే వైసీపీకి బలం
ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు భాగాలుగా విభజిస్తూ, పాలన వికేంద్రీకరణ బిల్లును గత రాత్రి అసెంబ్లీ ఆమోదించింది. ఇక, నేడు అదే బిల్లు శాసన మండలి ముందుకు రానుండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి మండలిలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు తగినంత బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్న సంగతి తెలిసిందే. తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలు, ఏడాది తరువాత పదవీకాలం పూర్తయిన ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికల తరువాతనే వైసీపీకి బలం పెరిగే అవకాశాలు పుష్కలం. ఇది జరగాలంటే, ఇంకో సంవత్సరానికిపైగా పడుతుంది.
ఈ నేపథ్యంలో నేడు మండలికి రానున్న పాలన వికేంద్రీకరణ బిల్లును, జగన్ సర్కారు ఎలా గట్టెక్కిస్తుందన్నది ప్రశ్నగా మిగిలింది. ఈ బిల్లును ఎలాగైనా మండలిలో అడ్డుకుని తీరుతామని ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ స్పష్టం చేసిన నేపథ్యంలో, నేడు అసెంబ్లీతో పోలిస్తే, మండలిలోనే వాడివేడి వాదనలు సాగనున్నాయి. మరోపక్క, ఈ బిల్లు నేడు మండలిలో కచ్చితంగా ఆమోదం పొందుతుందని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.