KTR: తెల్లవారుజామున 3.30 గంటలు... నాకిప్పుడు 'సామజ వర గమనా...' కంపెనీ ఇస్తోంది... ఎంత బాగుందీ పాట: కేటీఆర్
- ఎకమానిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లిన కేటీఆర్
- స్విట్జర్లాండ్ లో పాటను విన్న కేటీఆర్
- కేటీఆర్ ప్రశంసా ట్వీట్ పై స్పందించిన థమన్
ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనే నిమిత్తం దావోస్ లో ఉన్న తెలంగాణ మునిసిపల్ మంత్రి తారకరామారావు, పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. స్విస్ కాలమానం ప్రకారం, ప్రస్తుతం తెల్లవారుజామున 3.30 గంటలైందని, ఈ సమయంలో తన స్మార్ట్ ఫోన్ నుంచి 'సామజ వర గమనా...' పాటను వింటున్నానని కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. 'వాటే బ్రిలియంట్ సాంగ్...' అని కితాబునిస్తూ, సంగీత దర్శకుడు థమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట తన మదిని వీడటం లేదని అన్నారు.
ఇక ఈ ట్వీట్ ను చూసిన థమన్ సైతం స్పందించారు. తానకెంతో ఇష్టమైన వ్యక్తి నుంచి ఇటువంటి మెసేజ్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. "కేటీఆర్ సార్... మీరు మా పాటను మరింత సెన్సేషన్ చేశారు. మీ రోజును మా పాటతో ప్రారంభించారని తెలుసుకుని ఎంతో సంతోషిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.