Roja: బుల్లెట్ రైల్‌తో లోకేశ్.. రెయిన్ గన్లతో దేవాన్ష్ ఆడుకుంటున్నారా?: అసెంబ్లీలో నవ్వులు పూయించిన రోజా
- రాయలసీమకు బుల్లెట్ రైల్ తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు
- రెయిన్ గన్లతో కరవు లేకుండా చేశామన్నారు
- అమరావతిలో శాశ్వత నిర్మాణాలు ఎందుకు కట్టలేదు?
టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. అమరావతిలో శాశ్వత నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. 'పయ్యావుల కేశవ్ గారు పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నారు. రాజధానిపై ప్రేమ ఉంది అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని అంటున్నారు. మరి అప్పట్లో హైదరాబాద్‌లో ఆయన ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్‌కి అప్పట్లో అవకాశం లేదు కాబట్టే కట్టుకోలేదా?' అని ప్రశ్నించారు.
'రాయలసీమకు బుల్లెట్ రైల్ తీసుకొస్తున్నామని చంద్రబాబు అప్పట్లో అన్నారు. ఆ బుల్లెట్ రైల్ ఎక్కడికి పోయింది అధ్యక్షా? దానితో లోకేశ్ ఆడుకుంటున్నాడా? రెయిన్ గన్లతో కరవు లేకుండా చేశామన్నారు. ఎక్కడ ఉన్నాయి రెయిన్ గన్లు? వాటితో దేవాన్ష్ ఆడుకుంటున్నాడా అధ్యక్షా?' అని రోజా ప్రశ్నించారు.
'రైతు పక్షపాతి మా నాయకుడు జగన్. చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చిన రైతులకి నష్టపరిహారాన్ని రెట్టింపు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు కూడా పూర్తి న్యాయం చేస్తున్నారు. ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఆయన పాలన ఎలా ఉంటుందో కనపడుతోంది. ధరల స్థిరీకరణ నిధి, వడ్డీ లేని రుణాలతో రైతులకు జగన్ న్యాయం చేశారు. మా నాయకుడు ఉదారవాది' అని అన్నారు.
'సంక్షోభం తనకు కొత్త కాదని చంద్రబాబు అంటున్నారు. ఈ రాజధాని సంక్షోభాన్ని ఆయన ఓ అవకాశంగా వాడుకుని ఇక్కడి రైతులను ఆయన దోచుకున్నారు. ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉంటే పరిపాలన వికేంద్రీకరణ చేయకుంటే, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా ఉంటుందో చెప్పాలి' అని రోజా వ్యాఖ్యానించారు.