Kanna Lakshminarayana: బీజేపీ సహకారం ఉందని ప్రచారం చేసుకుంటున్నావ్: జగన్ పై కన్నా లక్ష్మినారాయణ ఫైర్
- పాదయాత్రలో పడిన బాధను ప్రజలపై తీర్చుకుంటున్నారు
- మూడు రాజధానులతో అతి పెద్ద అవినీతికి కుట్ర
- జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలి, తీసుకుంటున్న నిర్ణయాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా పడిన బాధను ఇప్పుడు ప్రజలపై తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఇసుకపై తీసుకున్న నిర్ణయాలు, తన సంస్థల్లో పని చేసిన వారికి అత్యధిక జీతాలతో పదవులు ఇవ్వడం, పార్టీ కార్యకర్తలు ఉద్యోగాలు ఇచ్చుకోవడం, పాస్టర్లకు ఇష్టం వచ్చినట్టు జీతాలు ఇవ్వడం వంటివన్నీ దారుణ నిర్ణయాలేనని చెప్పారు.
ఇప్పుడు అతిపెద్ద అవినీతికి కుట్ర పన్ని మూడు రాజధానుల కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయమని చెప్పారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులు చేస్తామని ఎన్నికల సందర్భంగా జగన్ చెప్పలేదని కన్నా అన్నారు. చంద్రబాబు చేసిన అరాచకాలకు విసిగిపోయే జగన్ ను ప్రజలు గెలిపించారని... ఆయన చెప్పిన నవరత్నాల మీద ఆశతో కాదని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. నియంతృత్వ పోకడలతో జగన్ పాలన సాగుతోందని చెప్పారు. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తానే తీసుకుంటున్నానని దమ్ముంటే జగన్ చెప్పాలని... నువ్వు తీసుకునే ప్రతి పిచ్చి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని చేసుకుంటున్న ప్రచారాన్ని బీజేపీ ఖండిస్తోందని అన్నారు.