Arvind Kejriwal: కాసేపట్లో ముగియనున్న ఎన్నికల నామినేషన్ గడువు.. క్యూలో 50 మంది వెనుక కేజ్రీవాల్.. ఉత్కంఠ
- నిన్న నామినేషన్ వేయలేకపోయిన కేజ్రీవాల్
- నేడు నామినేషన్ వేయడానికి వచ్చిన ఢిల్లీ సీఎం
- కేజ్రీవాల్ క్యూలో నిలబడాల్సిందేనన్న స్వతంత్ర అభ్యర్థులు
- ముందుకు వెళ్లనివ్వని వైనం
మరికాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ముగుస్తుంది. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేయలేకపోయిన విషయం తెలిసిందే. భారీ రోడ్ షో కారణంగా నిర్ణీత సమయానికి నామినేషన్ దాఖలు చేయాల్సిన కార్యాలయానికి చేరుకోలేకపోవడంతో నిన్న వెనక్కి వెళ్లారు. ఈ రోజు కూడా ఆయనకు విచిత్ర పరిస్థితి ఎదురైంది.
ఈ రోజు నామినేషన్ వేయడానికి వచ్చిన కేజ్రీవాల్ క్యూలో నిలబడ్డారు. ఆయన ముందు దాదాపు 50 మంది స్వతంత్ర అభ్యర్థులు క్యూలో ఉండడం గమనార్హం. నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి ఆయన తన తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. కేజ్రీవాల్‌ను స్వతంత్ర అభ్యర్థులు ముందుకు వెళ్లనివ్వట్లేదు. తమలాగే క్యూలో నిలబడాల్సిందేనని అంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల్లోపు అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది.