Andhra Pradesh: శాసనమండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం యోచన..?
- వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో విఘాతం
- పంతం నెగ్గించుకున్న టీడీపీ
- మండలి రద్దు ఆలోచనపై చర్చిస్తున్న వైసీపీ నేతలు..?
వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించుకున్న వైసీపీ సర్కారుకు శాసనమండలిలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. మండలిలో టీడీపీ ఆధిపత్యం ఉండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో, అసలు శాసనమండలినే రద్దు చేస్తే బిల్లుల ఆమోదానికి తమకు అడ్డంకి మరేదీ ఉండబోదని వైసీపీ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. మండలిని ఇప్పటికిప్పుడు రద్దు చేస్తే వచ్చే లాభాలేంటి, నష్టాలేంటని వైసీపీ నేతలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓసారి అత్యవసరంగా క్యాబినెట్ భేటీ నిర్వహించి ఆపై శాసనమండలిని రద్దు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని ప్రచారం జరుగుతోంది. ఈ ఉదయం మండలిలో మంత్రి బుగ్గన వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టగానే, టీడీపీ రూల్ నెం.71ను తెరపైకి తీసుకువచ్చి ప్రభుత్వ ఆశలను అడియాసలు చేసింది.