Pawan Kalyan: ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది.. అద్భుతాలు జరగబోతున్నాయి: పవన్ కల్యాణ్
- కూల్చివేతతో పాలనను ప్రారంభించినోళ్లు కూలిపోక తప్పదు
- వైసీపీ నేతల ప్రతి మాటను కక్కిస్తా
- ఢిల్లీ పెద్దలకు అన్ని విషయాలను వివరిస్తా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. వారం క్రితం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన పవన్ కల్యాణ్... ఆ పార్టీతో చేతులు కలిపారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ఇరు పార్టీలు కలిసి పోరాటం చేస్తాయని రెండు పార్టీల నేతలు విజయవాడలో మీడియా ముఖంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు మంగళగిరిలో పవన్ మాట్లాడుతూ, వైసీపీని కూల్చేంత వరకు నిద్రపోనని తెలిపారు. ఢిల్లీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని... తాను వెళ్తున్నానని చెప్పారు. ఏం జరుగుతుందో ఇప్పుడు తాను చెప్పడం లేదని... కానీ, అద్భుతాలు జరగబోతున్నాయని అన్నారు. కూల్చివేతతో పాలనను మొదలు పెట్టిన వారు... కూలిపోక తప్పదని చెప్పారు.
151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తనను ఎన్ని తిట్టినా భరిస్తానని... వారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను కక్కేలా చేస్తానని పవన్ అన్నారు. సీఎం జగన్ రెడ్డిని మూడు కాదు 30 రాజధానులను పెట్టుకోమనండి... అన్నింటినీ మళ్లీ కలిపి ఒకే రాజధానిగా చేస్తామని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలనే తమ ఆకాంక్ష అని, మీరు మద్దతిస్తారా? అని గత ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలను అడిగానని... అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, అమరావతికి తాము అనుకూలమని వారు చెప్పారని తెలిపారు.
వైసీపీ నేతలు విశాఖలో భూములు కొనుక్కున్నారని... అందుకే రాజధానిని అక్కడకు మార్చాలనుకున్నారని పవన్ ఆరోపించారు. అమరావతిలో వైసీపీ వాళ్లకు భూములు ఉండి ఉంటే రాజధానిని మార్చాలనుకునే వారు కాదని చెప్పారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగుంటే కేసులు పెట్టి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన ఢిల్లీ పర్యటనలో అక్కడి పెద్దలకు రాజధాని మార్పుపై అన్నీ వివరిస్తానని చెప్పారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచేలా చేస్తానని మాటిస్తున్నానని అన్నారు. అవకాశవాద రాజకీయాలకు తాను దూరమని... ప్రజలకు మనశ్శాంతిని కలిగించే రాజకీయాలనే చేస్తానని చెప్పారు. తాను ప్రతి రోజు రోడ్డు మీదకు రానని... కానీ అనుకున్నది సాధిస్తానని తెలిపారు.