Andhra Pradesh: నాపైకి ఎస్పీ లాఠీతో దూసుకువచ్చారు.... భయం వేసింది: గల్లా జయదేవ్
- గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు
- గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల
- తన అరెస్ట్ పర్వాన్ని మీడియాకు వివరించిన ఎంపీ
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు మంగళగిరి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా జైలు నుంచి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసలు నిన్న ఏం జరిగిందన్న విషయాలను వివరించారు.
"మేం శాంతియుతంగా ఉద్యమించేందుకు ప్రయత్నించినా, పోలీసులే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయారు. మేం వారిపై రాళ్లు వేశామని ఆరోపణలు చేశారు. వాళ్లపై వాళ్లే మట్టి వేసుకుని, అక్కడినుంచి లాఠీచార్జి చేయడం మొదలుపెట్టారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణ లేకుండా కొట్టారు.
లాఠీచార్జి మొదలవగానే నేను ఉన్నచోటనే కూర్చున్నాను. నా చుట్టూ తుళ్లూరు మహిళలు రక్షణ కవచంలా నిలుచున్నారు. కానీ పోలీసులు అందరినీ లాగేశారు. ఇంతలోనే ఎస్పీ విజయరావు నావైపు లాఠీతో దూసుకురావడంతో భయమేసింది. అయితే ఆయన నా వద్దకు వచ్చి లాఠీ పక్కనే ఉన్న పోలీసుకు ఇచ్చేశారు. నేను కూడా మౌనంగా ఉన్నాను.
ఇంతలో ఆయన నాకు నమస్కారం పెడితే నేను ఆయనకు నమస్కారం పెట్టాను. ఇక్కడ మీరు ఉండకూడదు అంటూ నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నాతో పాటు కొందరు నేతలు కూడా వస్తామంటే వారిని కూడా జీపెక్కించారు. మూడు గంటలపాటు అక్కడా ఇక్కడా తిప్పి చివరికి నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు" అంటూ తన అరెస్టు పర్వాన్ని గల్లా జయదేవ్ వివరించారు.