Pawan Kalyan: రాజధాని మార్పుపై న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు సూచనలు ఇవ్వాలి: ‘జనసేన’ లీగల్ సెల్ తో పవన్ కల్యాణ్
- లీగల్ విభాగం సభ్యులు న్యాయపరమైన కార్యక్రమాలకే పరిమితం కావొద్దు
- పార్టీలో వివిధ స్థాయుల్లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలి
- పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పవన్ కల్యాణ్
రాజధాని మార్పుపై న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు సూచనలు ఇవ్వాలని జనసేన లీగల్ విభాగానికి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో పార్టీ లీగల్ విభాగంతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ది రీజియన్స్ బిల్లు, అమరావతి మెట్రో డెవలప్ మెంట్ బిల్లుపై సమగ్రంగా అధ్యయనం జరిపి న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించాల్సిందిగా జనసేన లీగల్ విభాగానికి సూచించారు.
లీగల్ విభాగంలోని సభ్యులు కేవలం న్యాయపరమైన కార్యక్రమాలకే పరిమితం కాకుండా పార్టీలో వివిధ స్థాయుల్లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని అన్నారు. స్వాతంత్ర్యోద్యమం ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
న్యాయవాదులు తమ మేధో శక్తి ద్వారా సమాజాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్లగలరని, ముఖ్యంగా యువత ప్రస్తుతం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే పరిస్థితులను మనం కల్పించాల్సిన అవసరం ఉందని, యువతకు కేసుల నుంచి న్యాయ విభాగం రక్షణ కల్పించాలని సూచించారు. ప్రతి నెలలో ఒకటి లేదా రెండుసార్లు తప్పనిసరిగా న్యాయవిభాగంతో తాను సమావేశం అవుతానని, శాస్త్రీయ పద్దతిలో మరింత పటిష్టంగా రూపొందించడానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులను కోరారు.
న్యాయ విభాగం సూచనల మేరకు ముందుకెళ్తాం: నాదెండ్ల మనోహర్
అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులపై న్యాయ విభాగం ఇచ్చే సూచనల ఆధారంగా జనసేన అమరావతి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో నిర్ణయిస్తుందని పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.