Cricket: దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ గా క్వింటన్ డికాక్
- డుప్లెసిస్ కు ఉద్వాసన
- వన్డే జట్టులో కూడా స్థానం కోల్పోయిన మాజీ కెప్టెన్
- జట్టులోకి కొత్తగా ఐదుగురు ఆటగాళ్లు
త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొననున్న దక్షిణాఫ్రికా జట్టుకు కొత్త కెప్టెన్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. బ్యాట్స్ మన్ క్వింటన్ డికాక్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ప్రస్తుతం సఫారీ జట్టు సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరుగనుంది.
ఈ సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి డుప్లెసిస్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు తప్పించడమేకాక, వన్డే జట్టులో ఆటగాడిగా డుప్లెసిస్ ను ఎంపిక చేయలేదు. అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్‌కు కట్టబెట్టింది. కాగా జట్టులో కొత్తగా ఆటగాళ్లను చేర్చారు. వీరిలో లుథో సిపామ్లా, సిసండా మగలా, జోర్న్ ఫార్ట్యూన్, జానెమన్ మలన్, కైల్ వెర్రెయెన్ ఉన్నారు. వీరితో కలిపి ఇంగ్లండ్ తో తలపడే కొత్త జట్టును బోర్డు ప్రకటించింది.