IYR Krishna Rao: మూడు రాజధానులు అవసరం లేదు.. విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా చేయండి: ఐవైఆర్ కృష్ణారావు
- హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలి
- ఢిల్లీ అనేది మనకు బ్రిటీష్ వారు ఇచ్చిన వారసత్వ రాజధాని
- బ్రిటీష్ వారు కూడా కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరమే లేదని ఏపీ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. పూర్తి స్థాయి రాజధానిగా విశాఖను చేయాలని... హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఢిల్లీ అనేది మనకు బ్రిటీష్ వారు ఇచ్చిన వారసత్వ రాజధాని అని చెప్పారు.
తొలుత కలకత్తా కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగించిన బ్రిటీష్ వారు... ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజధానిని ఢిల్లీకి మార్చుకున్నారని తెలిపారు. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మార్చడాన్ని... బ్రిటీష్ కాలంలో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడంతో పోల్చవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీంతో పాటు ఈనాడు పత్రికలో ప్రచురితమైన 'అన్నీ ఒకే చోట... దేశ రాజధాని ఘనత' అనే కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.