Municipal Elections: పోలింగ్ కేంద్రం వద్ద ఎంఐఎం, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ.. కాంగ్రెస్ నేతకు గాయాలు
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
- ఓటర్లను ఎంఐఎం ప్రలోభ పెడుతోందన్న కాంగ్రెస్
- దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ
మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పరస్పరం నిఘా వేసుకుంటూ అనుమానం వచ్చినచోట అడ్డుకోవడం, వాగ్వాదాలు.. కొనసాగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంజిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఈరోజు ఉదయం ఎంఐఎం. కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి గాయపడ్డారు.
పోలింగ్ జరుగుతుండగా గంజిపేట పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేత శంకర్ ఎంఐఎం ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ అక్కడి వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంఐఎం సభ్యులు ఎదురు తిరిగారు. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగడంతో ఘర్షణ మొదలయ్యింది. ఈ ఘర్షణలో శంకర్ కాలికి గాయమయింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జితో ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతం శంకర్ ను ఆసుపత్రికి తరలించారు.