america: కోరితే కశ్మీర్ పై మధ్యవర్తిత్వానికి రెడీ: మళ్లీ పాతపాటే పాడిన ట్రంప్
- దావోస్ ఆర్థిక సదస్సు సందర్భంగా పాక్ అధ్యక్షుడితో భేటీ
- ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు
- భారత్, పాక్ లో పరిస్థితులు గమనిస్తున్నామని స్పష్టీకరణ
జమ్ముకశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహించేందుకు ఎప్పటి నుంచో ఆరాటపడుతున్న అగ్రరాజ్యం అమెరికా తన పాతపాటనే మళ్లీ వినిపించింది. దాయాది దేశాలు భారత్, పాక్ మధ్య నెలకొన్న ఈ వివాదం పై రెండు దేశాలు కోరితే మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటువంటి ప్రకటనలను గతంలోనే భారత్ ఖండించింది. కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని భారత్ కరాఖండిగా చెప్పేసింది.
అయినా అమెరికా తన తీరు మార్చుకోకుండా వీలు చిక్కినప్పుడల్లా ఈ మాట వల్లె వేస్తోంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన ట్రంప్ ఈ సందర్భంగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే కశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ ప్రస్తావించారు. 'కశ్మీర్ అతి పెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అమెరికా జోక్యంతోనే సాధ్యం అవుతుంది' అంటూ వ్యూహాత్మంగా మాట్లాడారు.
దీనిపై స్పందించిన ట్రంప్ భారత్, పాకిస్థాన్లలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తమ దేశం గమనిస్తోందని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌తో మునుపెన్నడూ లేనంతటి సంబంధాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఇరుదేశాల ఆర్థిక సంబంధాలతోపాటు కశ్మీర్ అంశంపైనా ఇమ్రాన్ తో చర్చించినట్టు ట్రంప్ తెలిపారు.