Kanna Lakshminarayana: ఏపీలో ప్రభుత్వాలు మారినా పరిస్థితుల్లో మార్పు లేదు: కన్నా లక్ష్మీనారాయణ
- నిర్మలా సీతారామన్ తో బీజేపీ-జనసేన భేటీ
- ఏపీలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించాం
- గత, ప్రస్తుత ప్రభుత్వాలు రాజకీయంపైనే శ్రద్ధ పెట్టాయి
ఏపీలో రాజకీయ, ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఢిల్లీలో నిర్మలా సీతారామన్ తో బీజేపీ, జనసేన నేతల సమావేశం ముగిసింది. అనంతరం, మీడియాతో కన్నా మాట్లాడుతూ, ఈ భేటీలో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న సహకారం, ప్రాజెక్టులపై కాకుండా కేవలం రాజకీయంపైనే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్న విషయం చర్చకు వచ్చిందని అన్నారు.
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన చెన్నై- విశాఖ కారిడార్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం, రాజధాని అమరావతికి ఫండింగ్ చేసేందుకు ప్రపంచ బ్యాంక్ సహకారం అందిస్తామన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం, రాష్ట్రానికి కేంద్రం నుంచి కావాల్సిన సహకారం, ప్రాజెక్టులు పూర్తి చేయడం మొదలైన అంశాల గురించి చర్చించామని చెప్పారు.
ఏపీలో గత ప్రభుత్వం కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకుని యూసీలు సమర్పించకుండా రాజకీయం చేసిందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పటికి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనపడటం లేదని, వైసీపీ ప్రభుత్వం రాజకీయమే ప్రధానాంశంగా ముందుకు వెళ్తోందని ఘాటు విమర్శలు చేశారు.