TATA: విదేశీ కంపెనీలకు దీటుగా 'ఆల్ట్రోజ్' 'ను తీసుకువచ్చిన టాటా మోటార్స్
- ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో తొలికారు తీసుకువచ్చిన టాటా
- ధర రూ.5.29 లక్షల నుంచి ప్రారంభం
- బీఎస్ 6 ప్రమాణాలతో తయారైన ఆల్ట్రోజ్
దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి 'ఆల్ట్రోజ్' పేరుతో కొత్త మోడల్ కారు మార్కెట్లోకి వచ్చింది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో టాటా కంపెనీకి ఇదే తొలి కారు. ఐదు పెట్రోల్ వేరియంట్లు, ఐదు డీజిల్ వేరియంట్లలో వస్తున్న ఆల్ట్రోజ్ కారు ధర పెట్రోల్ వెర్షన్ రూ.5.29 లక్షల నుంచి రూ.7.69 లక్షల మధ్య ఉంటుంది. డీజిల్ వెర్షన్ ఆల్ట్రోజ్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.29 లక్షల మధ్య ఉంటుంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఆల్ట్రోజ్ ప్రధానంగా సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్ లతో పోటీపడనుంది. బాలెనో,జాజ్ బీఎస్ 4 ప్రమాణాలకు లోబడి తయారు కాగా, ఆల్ట్రోజ్ బీఎస్ 6 ప్రమాణాలతో రూపుదిద్దుకుంది.
ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో సుజుకి బాలెనో అత్యధిక అమ్మకాలతో అగ్రగామిగా కొనసాగుతోంది. అటు హ్యుందాయ్, హోండా కూడా ఫర్వాలేదనిపించేలా అమ్మకాలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ కంపెనీ టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఆల్ట్రోజ్ ఎలాంటి పోటీ ఇస్తుందన్నది మార్కెట్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఆల్ట్రోజ్ లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థను మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లేదు.