smriti mandhana: అదే జరిగిన రోజున.. ఆ డిమాండ్ మొదట నానుంచే వస్తుంది: స్మృతి మంధాన
- పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్
- ఆ డిమాండ్ సబబు కాదన్న స్టార్ క్రికెటర్
- ఆ విషయం గురించి తాము ఆలోచించడం లేదని స్పష్టీకరణ
పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకూ వేతనాలు చెల్లించాలంటూ వస్తున్న డిమాండ్‌పై టీమిండియా విమెన్ క్రికెటర్ స్మృతి మంధాన స్పందించింది. ఆ డిమాండ్‌ను ఆమె పూర్తిగా వ్యతిరేకించింది. ఆ డిమాండ్ సరికాదని కుండబద్దలుగొట్టింది.
టీమిండియాలోని ‘ఎ ప్లస్’ విభాగంలో ఉన్న పురుష క్రికెటర్లకు బీసీసీఐ ఏడు కోట్ల రూపాయల వార్షిక వేతనం చెల్లిస్తుండగా, అదే కేటగిరీలో ఉన్న మహిళా క్రికెటర్లకు రూ. 50 లక్షలు మాత్రమే చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు చెల్లించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పురుష క్రికెటర్ల నుంచే బీసీసీఐకి అధిక ఆదాయం లభిస్తోందని పేర్కొన్న స్మృతి.. మహిళల క్రికెట్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరిన రోజున ఆ డిమాండ్ చేసేవారిలో తానే మొదట ఉంటానని స్పష్టం చేసింది. వేతనాల విషయంలో స్త్రీ, పురుష క్రికెటర్ల మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ తన సహచర క్రికెటర్లు మాత్రం ఆ విషయం ఆలోచిస్తుంటారని తానైతే అనుకోవడం లేదని పేర్కొంది. భారత్‌కు విజయాలు అందించడం, తద్వారా అభిమానులను స్టేడియాలకు రప్పించి ఆదాయం పెంచడంపైనే దృష్టి సారించినట్టు స్మృతి వివరించింది.