Amaravati: మండలి ఎఫెక్ట్: తర్వాత అడుగు కోసం సీఎంతో విజయసాయిరెడ్డి భేటీ
- రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై సుదీర్ఘ మంతనాలు
- రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలపై చర్చ
- అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో అడ్డుపుల్ల పడడం, సెలెక్ట్ కమిటీకి వెళ్లనుండడంతో తర్వాత అడుగులు ఎలా వేయాలన్న దానిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్ మంతనాలు జరుపుతున్నారు.
మండలి ఎఫెక్ట్ అనంతరం ఈ రోజు ఉదయం సాయిరెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశం వికేంద్రీకరణ బిల్లేనని చెబుతున్నారు. మండలి నిర్ణయం నేపథ్యంలో రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. అయితే న్యాయ నిపుణులతో చర్చించాకే ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.