Chandrababu: దీనివల్ల ఏం సాధిస్తారు మీరు? ఓడిపోయే గేమ్ మీది: చంద్రబాబుపై అంబటి ఫైర్
- మండలి గ్యాలరీలో నిన్న చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?
- ‘నన్ను చూసి నిర్ణయం చేయండి’ అనేలా షరీఫ్ కు బాబు సంకేతం పంపారు
- ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతేనా?
రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిన్న తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ‘శాసనమండలి గ్యాలరీలోకి వచ్చి నిన్న చంద్రబాబునాయుడు ఎందుకు కూర్చున్నారు? మండలి చైర్మన్ కు ఎదురుగా ఉండేలా గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు ఉద్దేశం ఏంటి? టీవీలు ఆగిపోతే వచ్చేస్తారా? ‘నన్ను చూసి నిర్ణయం చేయండి’ అనే విధంగా షరీఫ్ కు చంద్రబాబు సంకేతం పంపారని, ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతేనా?’ అని ప్రశ్నించారు. ఈ దురదృష్టకర పరిణామాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు.
‘దీనివల్ల ఏం సాధిస్తారు మీరు? ఓడిపోయే గేమ్ మీది. ఇలా అడ్డుకోవడం వల్ల ఏమైనా విజయం సాధిస్తారా?’ సెక్రటేరియట్ ను విశాఖకు పంపించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎంతకాలం ఆపగల్గుతారు? సెలెక్ట్ కమిటీకి పంపించిన నిర్ణయాన్ని పట్టుకుని అమరావతి పరిరక్షణ కమిటీ ఉద్యమకారులను మోసం చేయాలని చూస్తున్నారా? కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదాలనుకుంటున్నారా? ఇది సాధ్యమేనా? ఇలాంటి చర్యల ద్వారా మరోసారి మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు’ అని అంబటి విమర్శలు గుప్పించారు.
గందరగోళం చేయాలనుకుంటే నష్టపోతారు
సెక్రటేరియట్ ను విశాఖకు పంపాలన్న మా నిర్ణయం తప్పా? రైటా? అన్నది తేల్చవల్సింది చంద్రబాబునాయుడుగారు కాదు ప్రజలు. సెక్రటేరియట్ ను విశాఖలో పెడితే అన్ని ప్రాంతాల ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని భావిస్తున్నాం. అది మా నిర్ణయం, నమ్మకం. 151 సీట్లు గెలుచుకున్న మా నమ్మకాన్ని వమ్ము చేయదలచుకుంటే మళ్లీ వచ్చే ఎలక్షన్లలో చూసుకుందాం. కానీ, ఇలాంటి గిల్లి కజ్జాలు పెట్టి, శాసనమండలిని ఉపయోగించుకుని గందరగోళం చేయాలనుకుంటే మాత్రం నష్టపోతారు’ అని హెచ్చరించారు.
చంద్రబాబు ప్రభావం వల్లే ఇలా జరిగింది
‘శాసనమండలికి ‘పెద్దల సభ’ అని పేరు.. పిల్లల సభలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? శాసనమండలిలో చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్లను కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా. తెలుగుదేశం మినహా అన్ని పార్టీలు మీరు రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ‘సెలెక్ట్ కమిటీకి పంపవలసిన అవసరం లేదు.. పంపితే రూల్స్ కు భిన్నంగా పంపినట్టవుతుంది’ అని అందరూ చెప్పినప్పటికీ, నిర్ణయం తీసుకున్నారు. ఇది చంద్రబాబునాయుడు గారి ప్రభావం వల్లే జరిగింది. ఇది అప్రజాస్వామిక విధానం’ అని అంబటి ధ్వజమెత్తారు.