Piramal Group: తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్న పిరమల్ గ్రూప్
- మూడేళ్లలో రూ. 500 కోట్ల పెట్టుబడులు
- 2023 నాటికి అదనంగా 600 ఉద్యోగాల సృష్టి
- అజయ్ పిరమల్ తో కేటీఆర్ చర్చలు ఫలవంతం
రానున్న మూడేళ్లలో తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిరమల్ గ్రూపు నిర్ణయించింది. తమ గ్రూపులోని పిరమల్ ఫార్మా ద్వారా పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మెదక్ జిల్లాలోని దిగ్వాల్ లో పిరమల్ గ్రూపుకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడేళ్లలో రూ. 500 కోట్ల పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరించాలని సంస్థ నిర్ణయించింది.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ తో పిరమల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరిస్తామని కేటీఆర్ కు ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్న యూనిట్లను విస్తరింపజేయడమే కాకుండా.. హైదరాబాదు శివార్లలో ఏర్పాటు కానున్న ఫార్మా సిటీలో కూడా గ్రీన్ ఫెసిలిటీస్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2023 నాటికి మరో 600 ఉద్యోగాలను సృష్టిస్తామని తెలిపారు. హైదరాబాదులో పిరమల్ సంస్థల్లో ఇప్పటికే దాదాపు 1400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే నెలలో పిరమల్ గ్రూపు ప్రతినిధులు హైదరాబాదులో పర్యటించనున్నారు.