Pathipati Pullarao: వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది: టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు
- సీఐడీతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు
- ఏ తప్పు చేయలేదు.. ఎవరికీ భయపడేది లేదు
- తప్పుడు కేసులపై న్యాయ స్థానాలను ఆశ్రయిస్తాం
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ప్రాంత రైతులపై సీఐడీ విచారణ చేపట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపణ చేయలేని వైసీపీ ప్రభుత్వం సీఐడీతో కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు. బినామీలకు భూమిలిప్పించారంటూ.. బెల్లంకొండ నరసింహారావు, నారాయణ, తనపై కేసులు పెట్టారని చెప్పారు. తాము ఏ తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడేది లేదన్నారు.
ప్రభుత్వం ఏదో ఒక కేసు పెట్టి టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టాలని భావిస్తోందన్నారు. తప్పుడు కేసులు పెడితే.. తాము న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామన్నారు. పరువు నష్టం కేసులు వేస్తామన్నారు. ఆధారాలు లేకుండా తమపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తనతో గుమ్మడి సురేశ్ అనే రైతు కుమ్మక్కయ్యాడని ఆరోపిస్తున్నారన్నారు.
మండలిలో ఛైర్మన్ షరీఫ్ పట్ల వైసీపీ మంత్రులు ప్రవర్తించిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. మంత్రులు పోడియం వద్దకు వెళ్లడమేకాక, దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రులు పోడియం వద్దకు వెళ్లడం ఇప్పటివరకు తాను చూడలేదని చెప్పారు. శాసన సభలో వైసీపీ నేతలు ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరమన్నారు. వారు తమ అనుచిత ప్రవర్తనతో చట్ట సభల ప్రతిష్టను మంటగలిపారన్నారు. మీడియా గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలన నియంత పాలనను తలపిస్తోందన్నారు.