Yanamala: నిన్న శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను కొందరు గదిలో పెట్టి కొట్టబోయారు: యనమల రామకృష్ణుడు ఆరోపణలు
- సభ వాయిదా తర్వాత చైర్మన్ తన ఛాంబర్ లోకి వెళ్లారు
- ఆ ఛాంబర్ లోనే ఆయనపై దాడికి యత్నించారు
- ఈలోగా మార్షల్స్ వచ్చి షరీఫ్ ను తీసుకెళ్లారు
ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకే రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తారని, అక్కడ దాదాపు మూడు నెలల సమయం పడుతుందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నించే అధికారం అధికారపక్షానికి గానీ ప్రతిపక్షానికి గానీ లేవు కానీ, సమీక్షించమని విజ్ఞప్తి చేసుకోవచ్చని తెలిపారు. అధికారపక్ష సభ్యులు ఆవిధంగా చేయకపోగా చైర్మన్ పై దాదాపు దాడి చేసినంత పని చేశారని ఆరోపించారు.
ఇక సభ వాయిదా పడ్డ తర్వాత చైర్మన్ తన ఛాంబర్ లోకి వెళ్లారని, అక్కడి నుంచి కారు ఎక్కేందుకు వెళ్లేందుకు ఉపక్రమిస్తున్న సమయంలో ఆయనను గదిలో పెట్టి కొట్టేందుకు కొంతమంది యత్నించారని ఆరోపించారు. తన ఛాంబర్ డోర్ తీసుకుని బయటకు వస్తుంటే, బలవంతంగా ఆ డోర్ ని మళ్లీ మూసేసి దాడి చేయాలని చూశారని, ఈలోగా మార్షల్స్ వచ్చి అక్కడి నుంచి చైర్మన్ ను తీసుకెళ్లి కారు ఎక్కించారని చెప్పారు. ఎంత దౌర్జన్యం చేస్తున్నారనే దానికి ఈ ఘటనే అద్దం పడుతోందంటూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.