Telangana: సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి
- శనివారం ర్యాలీకి ఎంఐఎం సిద్ధం
- సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎంఐఎం
- అర్ధరాత్రి జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ఒవైసీ
కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఎంఐఎం మడమతిప్పని పోరాటం చేయాలని భావిస్తోంది. సీఏఏని మొదటినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎంఐఎం తాజాగా హైదరాబాదులో భారీ ర్యాలీకి సన్నద్ధమవుతోంది. సీఏఏతో పాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్ లను నిరసిస్తూ శనివారం నిర్వహించనున్న ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.
ర్యాలీ అనంతరం జరిగే సభా వేదికను చార్మినార్ నుంచి ఖిల్వత్ గ్రౌండ్స్ కు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా, ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.