Nirbhaya case: నిర్భయ దోషుల ఉరితీతపై కుటుంబ సభ్యులకు జైలు అధికారుల సమాచారం
- చివరిసారి చూడాలని ఉంటే రావాలని సూచన
- ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు ఉరి అమలు
- ఇప్పటికే జైలు నంబరు 3లో ఏర్పాట్లు
కోర్టు జారీ చేసిన డెత్‌వారెంట్ మేరకు నిర్భయ దోషులను ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు ఉరితీస్తున్నామని, మీ వారిని చివరిసారిగా చూడాలని ఉంటే ఈలోగా జైలుకు రావాలని దోషుల కుటుంబ సభ్యులకు తీహార్ జైలు అధికారులు సమాచారం అందించారు. నిర్భయ దోషులు వినయ్‌శర్మ, అక్షయ్, ముఖేష్, పవన్‌లను ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు ఉరితీయాలని కోర్టు డెత్‌వారెంటు జారీచేసిన విషయం తెలిసిందే.
ఉరిశిక్ష పడిన వారికి రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు మేరకు దోషుల చివరి కోరికను అడిగినా వారు నోరు విప్పకపోవడంతో జైలు అధికారులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మీ పిల్లలను చూడాలని ఉంటే రావాలని కోరారు. కాగా, ఉరిశిక్ష అమలుకు అధికారులు జైలు నెం3లో ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇసుక బస్తాలతో ట్రైల్స్ కూడా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ జల్లద్ నలుగురు దోషులను ఉరితీయనున్నారు.