Telangana: వీడిన మిస్టరీ.. వారాసిగూడ బాలిక మృతి కేసులో స్నేహితుడే నిందితుడు!
- కేసును ఛేదించిన పోలీసులు
- నిందితుడు షోయబ్, హతురాలికి చిన్నప్పటి నుంచే పరిచయం
- పెళ్లికి ఒప్పుకోని అమ్మాయి కుటుంబ సభ్యులు
హైదరాబాద్‌లోని వారాసిగూడలో భవనం పైనుంచి పడి మృతి చెందిన బాలిక కేసు మిస్టరీ వీడింది. సదరు ఇంటర్ విద్యార్థినిని ఓ యువకుడు బండరాయితో కొట్టి, భవనం పైనుంచి కిందకు పడేయడంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును ఛేదించి ఈ రోజు వివరాలు వెల్లడించారు.
నిందితుడు షోయబ్, హత్యకు గురైన విద్యార్థిని చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ప్రస్తుతం ఫ్లెక్సీ బోర్డ్ డిజైనర్‌గా పని చేస్తున్న షోయబ్, తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానని ఇటీవల ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే, బాలిక మైనర్ కావడంతో ఆ బాలిక తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నుంచి ఆమె షోయబ్‌తో మాట్లాడట్లేదు.
ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బాలిక ఇంటికి షోయబ్ వచ్చాడు. ఆమెతో మాట్లాడాలని చెప్పి బాలికను భవనంపైకి తీసుకెళ్లాడు. అక్కడ మాట్లాడుకుంటూ ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో షోయబ్ ఓ బండరాయితో ఆమె తలపై కొట్టి, ఈడ్చుకుంటూ వెళ్లి భవనంపైనుంచి కిందకు పడేశాడు. కాగా, నిందితుడు షోయబ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.