Telugudesam: టీడీపీ ఎమ్మెల్సీలు హీరోల్లా మిగిలారు: చంద్రబాబునాయుడు ప్రశంసలు
- రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ ఎమ్మెల్సీలు పని చేశారు
- రాష్ట్రాన్ని రక్షించే రక్షకులుగా వారిని చూస్తున్నారు
- మా ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టినా వారు లొంగలేదు
తమ పార్టీ ఎమ్మెల్సీలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. మంగళగిరిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ ఎమ్మెల్సీలు హీరోల్లా మిగిలారు అని, నీతి నిజాయతీలకు పట్టం కట్టారని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ ఎమ్మెల్సీలు పని చేశారని, ఒత్తిళ్లకు లోనుకాలేదని, ఒక నిబద్ధతతో ముందుకుపోయారని ప్రజలు ప్రశంసిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని రక్షించే రక్షకులుగా టీడీపీ ఎమ్మెల్సీలను ప్రజలు చూస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
కళ్లు తిరిగే డబ్బులు, ఫ్లాట్లు, కార్లు, ఇప్పుడే కాకుండా రాబోయే రోజుల్లో కూడా పదవులు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్సీలను కొందరు ప్రలోభ పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా వారు భయపడలేదని, ఒక ఉక్కు సంకల్పంతో వాళ్లు ఉన్నారని, టీడీపీ ఎమ్మెల్సీలు చూపించిన చొరవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ఈ సందర్భంగా శాసనమండలిని రద్దు చేస్తారన్న వార్తలపై చంద్రబాబు స్పందిస్తూ, ఒకవేళ మండలిని రద్దు చేయాలనుకుంటే ఆ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి ఒకటిన్నర, రెండు సంవత్సరాలు పడుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు.
ప్రజలకు సేవ చేయాలని, నీతినిజాయతీగా ఉండాలని అనుకుంటున్న ప్రతిఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని తమ నాయకులకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ పైనా ఆయన ప్రశంసలు కురిపించారు. షరీఫ్ ను ప్రజలు ఆరాధించే పరిస్థితికి వచ్చారని, ఆయనను ఒక ఐకాన్ గా చూస్తున్నారని అన్నారు. నీతినిజాయతీగా ఉంటే మనిషిని ఏ విధంగా గుర్తిస్తారనే దానికి నిదర్శనం షరీఫే అని కొనియాడారు.