YSRCP: మండలి రద్దుపై సోమవారం నిర్ణయం తీసుకుని పార్లమెంటుకు పంపుతాం: పిల్లి సుభాష్ చంద్రబోస్
- మండలి రద్దు విషయంపై సోమవారం పునః సమీక్ష చేస్తాం
- పార్లమెంట్ ఆమోదిస్తే శాసన మండలి రద్దు అవుతుంది
- ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదలందరికి ఇళ్ల పట్టాలు
శాసన మండలి రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తుండడంతో ఈ అంశంపై ఏపీలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... మండలి రద్దు విషయంపై సోమవారం పునః సమీక్ష చేస్తామని, తమ నిర్ణయాన్ని పార్లమెంటుకు పంపుతామని స్పష్టం చేశారు. ఒకవేళ తమ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే శాసన మండలి రద్దు అవుతుందని చెప్పారు.
కాగా, ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పేదలకు ఇచ్చే ప్రతి ఇంటి స్థలం మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం జగన్ సూచనలు చేశారని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. 21.34 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ఇప్పటివరకు 26,136 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, మరో 12,219 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు.