Turkey: టర్కీని కుదిపేసిన భారీ భూకంపం.. 18 మందికి పైగా మృతి
- రిక్టర్ స్కేలుపై 6.8గా తీవ్రత నమోదు
- 500 మందికి పైగా గాయాలు
- స్వల్ప కాలంలోనే 60 ప్రకంపనలు
టర్కీలో నిన్న రాత్రి సంభవించిన భారీ భూకంపంలో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 500 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ప్రావిన్స్, సివ్రిన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. భూప్రకంపనలు మొదలుకాగానే జనం భయంతో వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. స్వల్ప కాలంలోనే 60 ప్రకంపనలు నమోదైనట్టు టర్కీ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
భూకంపం ధాటికి కూలిన భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాల కింద 30 మంది వరకు చిక్కుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా, సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు.