Telangana Municipal Elections: తెలంగాణలో మొదలైన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఈ నెల 22న జరిగిన ఎన్నికలు
- మరో రెండు గంటల్లో తేలిపోనున్న ఫలితాల సరళి
- సాయంత్రానికి పూర్తి ఫలితాలు
తెలంగాణలోని 120 మునిసిపాలిటీల్లో 2,647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలు కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. అనంతరం బ్యాలెట్ పేపర్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 134 కౌంటింగ్ కేంద్రాల్లో 2,169 టేబుళ్లు ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియలో మొత్తం 10 వేల మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో రెండు గంటల్లోనే ఫలితాలు ఎవరికి అనుకూలమనేది తేలిపోనుంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నెల 22న జరిగిన పురపాలక ఎన్నికల్లో 30 లక్షల మంది, నగర పాలక (కరీంనగర్ కాకుండా) సంస్థల్లో దాదాపు 8 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.