world of cricket: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన రికార్డు.. టెస్ట్ క్రికెట్ లో 5 లక్షల పరుగులు!
- అత్యధిక పరుగులు సాధించిన దేశంగా రికార్డు
- 1022 టెస్ట్ ల ద్వారా ఈ ఘనత
- రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన దేశంగా రికార్డు నెలకొల్పింది. క్రికెట్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే దేశం ఇంగ్లండ్. ఈ క్రీడకు మాతృకగా ఆ దేశాన్ని భావిస్తారు. అందుకే క్రికెట్ లో ఏ సంచలనం నమోదైనా ముందు ఇంగ్లండ్ వైపు ప్రపంచం చూస్తుంది. ఒకప్పటి తన జాతీయ క్రీడ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్లు ఇప్పటి వరకు 5 లక్షల పరుగులు చేసి ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. క్రికెట్ లో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా గుర్తింపు పొందిన ఇంగ్లండ్ తాజాగా ఐదు లక్షల పరుగుల మైలురాయి దాటి మరో రికార్డు నెలకొల్పింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సీరీస్ నాల్గో టెస్ట్ లో ఇంగ్లండ్ ఆటగాడు, జట్టు కెప్టెన్ జోరూట్ సింగిల్ తీయడం ద్వారా ఐదు లక్షల మైలురాయిని అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ ప్రారంభమయ్యాక ఆ దేశానికి ఇది 1,022వ టెస్ట్.
పదహారవ శతాబ్దంలో ఇంగ్లండ్ లో క్రికెట్ క్రీడ మొదలయ్యిందని చరిత్ర చెబుతోంది. ఆగ్నేయ ఇంగ్లండ్ (సౌత్ ఈస్ట్) లో ప్రారంభమైన క్రీడ కొన్నాళ్లకు దేశమంతా విస్తరించింది. 18వ శతాబ్దంలో ఆ దేశ జాతీయ క్రీడగా రాణించింది. 1739లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఏర్పడింది. 19వ శతాబ్దంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదులతోపాటే క్రికెట్ కూడా ఇతర దేశాలకు విస్తరించడం ప్రారంభించింది.
20వ శతాబ్దం వచ్చేసరికి చాలాదేశాల్లో ప్రముఖ క్రీడగా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 55 చిన్నా పెద్ద దేశాలు క్రికెట్ క్రీడను ఆస్వాదిస్తుండగా, వీటిలో మూడో వంతు దేశాలకు ప్రపంచ క్రికెట్ లో ప్రాతినిధ్యం లభిస్తోంది. కాగా, ప్రపంచ క్రికెట్ లో ఇంగ్లండ్ తర్వాత అత్యధిక రన్స్ చేసిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 830 టెస్టులు ఆడిన ఆ దేశ ఆటగాళ్లు 4,32, 706 పరుగులు చేశారు.
భారత్ జట్టు 540 టెస్టుల్లో 2,73,518 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ 545 టెస్టులతో 2,70,441 పరుగులతో నాల్గో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా పోర్ట్ ఎలిజిబెత్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ విదేశీ గడ్డపై ఐదు వందల టెస్టులు ఆడిన తొలి జట్టుగా మరో ఘనత కూడా సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(404) రెండో స్థానంలో ఉంది.