Varla Ramaiah: సీఎం జగన్ కు కోర్టుల పట్ల గౌరవం లేదు: టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శ
- అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టు విచారణను ఎదుర్కోవాలి
- జగన్ తన ఆస్తుల వివరాలు వెల్లడించాలి
- లోటస్ పాండ్ ఎవరిదో చెప్పాలి
సీఎం జగన్ ఈ మధ్య కంగారు పడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఇందుకు కారణం.. ఆయనపై నమోదైన 11 కేసుల్లో విచారణ ముంచుకు రావడమేనని అన్నారు. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు కోర్టు హాజరు నుంచి తప్పించుకున్న జగన్ ఇక తప్పించుకోలేరని పేర్కొన్నారు. గత మే నుంచి జనవరి 25వరకు జరిగిన ట్రయల్స్ లో జనవరి 10న మాత్రమే కోర్టుకు హాజరయ్యారన్నారు. తాజాగా కోర్టులో హాజరు కావాలని కోర్టు పేర్కొనటం పట్ల వర్ల హర్షం వ్యక్తం చేశారు.
2012లో జగన్ పై సీబీఐ 11 చార్జీషీట్లు నమోదు చేయగా, అనంతరం ఈడీ 5 చార్జీషీట్లు వేసిందని వర్ల అన్నారు. 2014 మార్చి 10న సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరిస్తూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణను సంవత్సరంలో పూర్తి చేయాలని పేర్కొన్న విషయాన్ని వర్ల ఈ సందర్భంగా ఉటంకించారు. మిగతా కేసుల్లో ఈ ఆదేశాలు అమలవుతున్నాయి, కానీ జగన్ పై కేసులు ఇన్నేళ్లుగా ఎందుకు సాగుతున్నాయో తెలియటం లేదన్నారు. సీబీఐ కోర్టుపై తమకు గౌరవముందంటూ.. జగన్ పై కేసుల విచారణలో ఆలస్యం జరగటంపై ప్రశ్నించారు. రాజకీయ నాయకులపై కేసులను సంవత్సరంలోగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి మోదీ కూడా చెప్పారన్నారు.