Narendra Modi: తన ఇన్నింగ్స్ ను ప్రస్తావించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన వీవీఎస్ లక్ష్మణ్!
- 2001లో కోల్ కతాలో చారిత్రక మ్యాచ్
- ఫాలో ఆన్ ఆడి విజయం సాధించిన జట్టుగా భారత్ ఘనత
- విద్యార్థులకు నాటి ఘటన వివరించిన మోదీ
ప్రస్తుతం టెస్టు క్రికెట్ లో ప్రత్యర్థి జట్టును ఫాలో ఆన్ ఆడించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచింపజేసేలా చేసిన ఘనత టీమిండియాదే. 2001లో కోల్ కతాలో ఓటమిబాటలో ఉన్న భారత జట్టు ఫాలో ఆన్ ఆడడమే కాకుండా, ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. అందుకు కారణం హైదరాబాదీ స్టయిలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన మరపురాని ఇన్నింగ్సే. రాహుల్ ద్రావిడ్ తో కలిసి లక్ష్మణ్ నెలకొల్పిన భాగస్వామ్యం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. తాజాగా ఈ మరపురాని ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ 'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో ప్రస్తావించారు.
విద్యార్థులతో మాట్లాడుతూ, తాత్కాలిక అడ్డంకుల గురించి ఆలోచించవద్దని చెప్పారు. నాడు గంగూలీ సేన కోల్ కతాలో ఆస్ట్రేలియాపై సాధించిన విజయాన్ని వారికి వివరించారు. కష్టాలు ఎప్పుడూ ఉండవని, పోరాడడం ముఖ్యమని తెలిపారు. కాగా, తమ గురించి ప్రధాని మోదీ విద్యార్థులకు చెప్పడం పట్ల వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. కోల్ కతాలో జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్ గురించి విద్యార్థులకు వివరించినందుకు థాంక్యూ మోదీ గారు అంటూ ట్వీట్ చేశారు. "పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇదే నా సలహా. మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండడమే కాదు, వాటిని చేరుకునేందుకు అంకితభావంతో పనిచేయాలి. ఇతరులతో పోల్చుకోకుండా కష్టపడాలి" అంటూ లక్ష్మణ్ సూచించారు.